సూర్యాపేట జిల్లాలో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం 7.25 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
పులిచింతల ప్రాజెక్టు సమీపంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్‌లో భూమి కంపించింది.
మరోవైపు నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది. భూకంప సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఒక్క సారిగా లేచి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇండ్లలో నుంచి రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు.
రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. ఎవరికీ ఎలాంటి ప్రాణహానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది డిసెంబర్ 6న జహీరాబాద్ మండలం బిలాపూర్‌లో భూకంపం సంభవించింది. అక్టోబర్ 2, 2021న రామగుండం, మంచిర్యాల మరియు కరీంనగర్‌లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 4.0గా నమోదైంది.