ప్రపంచదేశాలను గడగడలాడించిన కరోనా.. మరోసారి విశ్వరూపం దాల్చాడానికి సిద్ధం అవుతోంది. దేశంలో అక్కడక్కడ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా.. 2,527 మందికి పాజిటివ్ గా తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.35 కోట్లకు పైగా చేరిందని స్పష్టం చేసింది. మరణాల సంఖ్య 5.22లక్షలకు పైగా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56శాతానికి పైగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 15,079 యాక్టివ్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శుక్రవారం 19,13,296 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,46,72,536కు చేరింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.
ఒక్కరోజు వ్యవధిలో 6,68,787 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,527 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని నిపుణులు చెప్తున్నారు.