ఇప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు తలనొప్పిగా తయారయ్యారు ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు. తాజాగా వీరికి తోడయ్యారు ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించని కారణంగా.. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చిన్న, మధ్యతరహా దినపత్రికల సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల ఆత్మగౌరవం రోజురోజుకూ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చిన్న పత్రికలకు తీరని అన్యాయం చేస్తోందని వివర్శించారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారు. మొదటగా ఈటల రాజేందర్ కు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు.
ఇక తమకు న్యాయం జరిగే వరకు పోరుబాటను వదిలేది లేదని సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు అశోక్, దయానంద్, అక్తర్ హుస్సేన్, ఇక్బాల్ హుస్సేన్, అమన్, వెంటయ్య సహా పలువురు పాల్గొన్నారు.