ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, విజయ్ లాంటి పెద్ద హీరోలు బరిలోకి దిగుతున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో మరో సినిమా వస్తే కచ్చితంగా నష్టపోతుంది. కానీ, యూవీ నిర్మాతలు మాత్రం డేర్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో మరో చిన్న సినిమా రిలీజయ్యే అవకాశం ఉందనే ఊహాగానాల్ని నిజం చేస్తూ, తమ సినిమాను సిద్ధం చేస్తున్నారు.
అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి బరిలో సంతోష్ శోభన్ నటించిన సినిమా రిలీజ్ అవుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.
యూవీ క్రియేషన్స్ ను ఆంధ్రాలో డిస్ట్రిబ్యూషన్ వింగ్ ఉంది. తమకంటూ కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడీ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మరో 2 రోజుల్లో నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే కొన్ని థియేటర్లతో ఒప్పందాలు కూడా చేసుకుంది.
ఇలా తమ చేతిలో ఉన్న థియేటర్లలో కొన్నింటిని వాల్తేరు వీరయ్యకు, మరికొన్నింటికి వీరసింహారెడ్డికి కేటాయించింది ఈ సంస్థ. ఇక మిగిలిన థియేటర్లలో సంతోష్ శోభన్ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుంది. ఒకవేళ రిలీజ్ చేయాలని యూవీ భావిస్తే మాత్రం టైటిల్ ప్రకటించి, వెంటనే ప్రచారంలోకి దూకేయాలి. ఎందుకంటే తక్కువ టైమ్ ఉంది.