న్యాయాన్ని ప్రజల ఇంటి గడప వద్దకు తీసుకు వెళ్లాలని, అందుకోసం జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ అన్నారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయసేవల అధికారుల సమావేశంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ ప్రజల్లో చాలా మందికి న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేక, న్యాయ సహకారం అందకపోవడంతో మౌనంగా బాధపడుతున్నారని అన్నారు.
న్యాయ ప్రక్రియలో ప్రజలకు జిల్లా న్యాయ సేవల అధికారులే అత్యంత దగ్గరగా ఉంటారని అన్నారు. జిల్లా న్యాయస్థానాల్లో వారికి ఎదురైన అనుభవాల ఆధారంగానే న్యాయ వ్యవస్థపై వారి అభిప్రాయం ఉంటుందన్నారు.
జిల్లాల్లో న్యాయవ్యవస్థలను పటిష్ఠం చేయడం ఇప్పుడు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలదే కీలకపాత్ర అని తెలిపారు.