మొబైల్ ఫోన్ కోసం డ్యామ్నే ఖాళీ చేయించాడు ఓ అధికారి. అసలే ఎండా కాలంలో చాలా గ్రామాల్లో గొంతు తడుపు కుందామంటే నీళ్లు దొరకని పరిస్థితులు వుంటే ఆ అధికారి మాత్రం లక్షల లీటర్ల నీటిని వృథా చేశాడు. వేల ఎకరాలను తడపాల్సిన నీటిని తన వెధవ పనితో వేస్ట్ చేసిన ఆ అధికారిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే
చత్తీస్ గఢ్లోని కంకేర్ జిల్లాలో రాజేశ్ విశ్వాస్ అనే వ్యక్తి ఫుడ్ ఇన్స్ పెక్టర్గా పని చేస్తున్నారు. జిల్లాలోని ఖేర్ కట్టా రిజర్వాయర్ వద్దకు తన మిత్రులతో కలిసి గత ఆదివారం రాజేశ్ పిక్నిక్ కు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ దిగుతున్న సమయంలో ఆయన ఫోన్ డ్యామ్ లో పడిపోయింది. రూ. 96000 విలువ చేసే తన మొబైల్లో చాలా విలువైన డేటా ఉందని మొదట గజ ఈత గాళ్లతో డ్యామ్ లో వెతికించాడు.
కానీ ఆ మొబైల్ దొరకలేదు. దీంతో ఆ డ్యామ్ లోని నీటిని ఖాళీ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 30 హెచ్పీ డీజిల్ పంపులను డ్యామ్ వద్దకు తీసుకు వచ్చాడు. పంపులను ఉపయోగించి డ్యామ్ నుంచి ఒక్క రోజులోనే 21 లక్షల లీటర్ల నీటిని తోడే శాడు. కానీ అప్పటికీ మొబైల్ దొరకలేదు.
దీంతో మూడు రోజుల పాటు నీటిని తోడేశాడు. అయితే చివరకు మొబైల్ దొరికినా నీటిలో తడవడంతో వర్కింగ్ కండీషన్లో లేక పోవడం గమనార్హం. ఆ అధికారి చేసిన పనిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆ నీటితో సుమారు 2వేలకు పైగా ఎకరాలకు సాగు నీటిని అందించ వచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన మొబైల్ ఫోన్ లో విలువైన డేటా వుందని, నీటిని ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి మౌఖికంగా అనుమతులు తీసుకున్నానని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో అధికారులు రాజేశ్ పై చర్యలు తీసుకున్నారు. అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.