నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ వెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు.
ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్ ధర్నా చేయడం లేదని, కేవలం రాహుల్ గాంధీకి చెందిన రెండు వేల కోట్ల ఆస్తుల్ని కాపాడేందుకే ఇలా చేస్తోందని ఆమె అన్నారు. నిరసనలతో దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
రాహుల్ గాంధీ సహా చట్టం ముందు ఎవరూ గొప్ప కాదన్నారు. గాంధీ కుటుంబంపై నమోదైన ఈడీ కేసు వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాట సమయం(1930)లో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌ను స్థాపించారని కేంద్ర మంత్రి తెలిపారు.
వార్తాపత్రికను నడిపంచాలన్న ఉద్దేశంతో సంస్థను ప్రారంభించగా ఆ సమయంలో సుమారు ఐదువేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారని ఆమె వివరించారు. కానీ ఇప్పుడు ఆ సంస్థ గాంధీ కుటుంబం చేతుల్లోకి వెళ్లినట్టు ఆరోపించారు.