కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాకు హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది.
గోవాలో స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్మృతి ఇరానీతో పాటు ఆమె కూతురుపై ఆరోపణలకు సంబంధించి చేసిన ట్వీట్లను, పోస్టులు, ఫోటోలు, వీడియోలను 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇచ్చిన గడువులోగా ముగ్గురు కాంగ్రెస్ నేతలు వీటిని తొలగించాలని, లేనిపక్షంలో ట్విట్టర్, యూట్యూబ్ లు వీటిని తొలగిస్తాయని హైకోర్టు పేర్కొంది. తన కూతురుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై స్మృతి ఇరానీ రూ.2 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు.
కేంద్ర మంత్రి దాఖలు చేసిన వ్యాజ్యంపై సమధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వాస్తవాలను కోర్టు ముందు ఉంచేందుకు తాము ఎదురు చూస్తున్నామంటూ కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు.
మరోవైపు ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యల వివాదంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని స్మృతి ఇరాని విమర్శించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. ఈ విషయంలో సోనియాకు స్మృతీ ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందే అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. స్మృతి ఇరానీని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు.