పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్ సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్ లోకి వస్తున్నారు. ఆ సమయంలో.. బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా.. ఇటీవల ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరింది. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ చేరి.. కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
ఆ తర్వాత ఆమె కూడా లక్నోలోని తన మామ ములాయం సింగ్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమె తలపై చేయి పెట్టి దీవించారు. అదే తరహాలో మళ్లీ స్మృతి ఇరానీ తనకు నమస్కరించడంతో రాజకీయంగా చర్చ జోరుగా నడుస్తోంది.