ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం సోమవారం ప్రారంభమైంది. ప్లేయర్ల కోసం ఐదు టీమ్ లు పోటీ పడుతున్నాయి. ఈ వేలంలో 409 మంది క్రికెటర్లు తమ లక్ ని పరీక్షించుకోనున్నారు. అయితే అందులో 246 మంది దేశీయ ప్లేయర్లు కాగా.. 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ లీగ్ లో భారత ఉమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మంధానకి భారీ ధర పలికింది. వేలంలోకి రూ.50 లక్షల కనీస ధరతో వచ్చిన స్మతి కోసం ఫస్ట్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ బిడ్ వేయగా.. వెంటనే రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కూడా పోటీకి వచ్చింది. దీంతో స్మృతి ధర క్షణాల్లోనే రూ.3 కోట్లని దాటేసింది.
ఈ రెండు ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడుతుండటంతో.. మిగిలిన మూడు ఫ్రాంచైజీలు సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాయి. చివరి వరకూ పట్టు వదలని ఆర్సీబీ రూ.3.4 కోట్లకి స్మృతి మంధానని దక్కించుకుంది. వేలంలో ఫస్ట్ వచ్చిన పేరు స్మృతిదే కావడం విశేషం. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో స్మృతి మంధాన ఒకరు.
ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కు ఏకంగా 112 T20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు 27.32 సగటుతో మొత్తం 2651 పరుగులు చేసిందామె. ఇందులో 20 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లో మంధాన స్ట్రైక్ రేట్ 123 కంటే ఎక్కువ. స్మృతి కూడా మహిళల బిగ్ బాష్ లీగ్ లో ఆడుతోంది.
ఆ తర్వాత వేలంలో రెండో పేరు భారత ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ది వచ్చింది. ఈమె కూడా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్ కోసం పట్టుబట్టిన ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ.1.8 కోట్లకి కొనుగోలు చేసింది. వాస్తవానికి హర్మన్ ప్రీత్ కూడా రూ.2 కోట్లపైనే ధర పలుకుతుందని అంతా ఊహించారు. కానీ స్మృతి మంధానతో పోలిస్తే హర్మన్ ప్రీత్ ఇటీవల చెప్పుకోదగ్గ ఫామ్ లో లేదు.