భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 22 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన స్మృతి మొత్తం 855 పరుగులు చేసి 38.86 సగటు నమోదు చేసుకుంది.
ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఎనిమిది మ్యాచ్ లలో భారత్ రెండు మాత్రమే విజయం సాధించింది. ఈ రెండు విజయాల్లోనూ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులు చేసి భారత్ ను సునాయాసంగా గెలుపుబాటపట్టించింది. చివరి టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు చేసింది.
అటు.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ భారత్ ఓడిపోతుందని అంతా భావించినా.. 78 రన్స్ చేసిన స్మృతి, మ్యాచ్ డ్రా అయ్యేలా చేసింది. టీ20 సిరీస్‌లో 15 బంతుల్లో 29 పరుగుల చేసి రికార్డ్ సాధించడంతో పాటు అర్ధ సెంచరీ చేసి సత్తా చాటింది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా స్మృతి తన వంతు కృషి చేసింది. రెండో వన్డేలో 86 పరుగులు సాధించింది. కంగారూలతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ చేసిన సత్తా చాటింది. ఇలా పలు మ్యాచ్‌లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.