హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల్లో పీవీఆర్ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. తమ మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు 150 రూపాయల నుంచే మొదలవుతున్నాయని, థియేటర్లకు రావాలని ప్రేక్షకుల్ని కోరుతోంది. ఇదే బాటలో మరికొన్ని మల్టీప్లెక్సులు కూడా టికెట్ రేట్లు తగ్గించాయి. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో ఏషియన్ గ్రూప్ ఆఫ్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి.
అయితే.. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని మల్టీప్లెక్సుల వైపు అడుగులు వేస్తే మాత్రం షాక్ కొట్టడం గ్యారెంటీ. ఎందుకంటే, టికెట్ రేట్లు తగ్గించాం, మల్టీప్లెక్సులకు రండి అంటూ చేసే ప్రచారం కేవలం జిమ్మిక్కు మాత్రమే. అడుగుపెడితే మాత్రం జేబుకు చిల్లు పడిపోతోంది. ఉదాహరణకు పీవీఆర్ మల్టీప్లెక్సునే తీసుకుందాం.
నిన్న విక్రాంత్ రోణ అనే సినిమా రిలీజైంది. ఈ పాన్ ఇండియా సినిమాకు రీజనబుల్ టికెట్ రేట్లే పెట్టింది మల్టీప్లెక్స్ సంస్థ. కానీ ఇంటర్వెల్ టైమ్ లో స్నాక్స్ రేట్లు మాత్రం చుక్కల్ని తాకాయి. ఓ పాప్ కార్న్ తిని, కూల్ డ్రింక్ తాగితే అక్షరాలా 650 రూపాయలవుతోంది. బయట 20 రూపాయలకు దొరికే కూల్ డ్రింక్ ఖరీదు, పీవీఆర్ లో అక్షరాలా 300 రూపాయలు.
ఓవైపు స్నాక్స్ రేట్లు ఇలా పెట్టి, మరోవైపు టికెట్ రేట్లు తగ్గించాం థియేటర్లకు రమ్మని అడగడం అర్థరహితం. ఏ రాయి అయితే ఏముంది పళ్లు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు, డబ్బులు పోగొట్టుకోవడానికి ఏ మల్టీప్లెక్సుకు వెళ్లినా అంతే సంగతులు. దాదాపు ప్రతి మల్టీప్లెక్సులో నిలువు దోపిడీ జరుగుతోంది.
పాప్ కార్న్ చిన్నది తిందామంటే ఇక్కడ కుదరదు. పాప్ కార్న్ స్మాల్ 280 రూపాయలు, బిగ్ సైజ్ అయితే 300 రూపాయలు. 20 రూపాయలు మాత్రమే తేడా. ఇదే మరి మల్టీప్లెక్స్ మాయాజాలం అంటే. పోనీ, కాఫీతో సరిపెట్టుకుందామంటే, దానికో బ్రాండ్ జతచేసి 150 రూపాయలు చేశారు.
మల్టీప్లెక్సుల్లో ఈ స్థాయిలో దోపిడీ జరుగుతోంది కాబట్టే, టికెట్ రేట్లు తగ్గించినా ఫలితం కనిపించడం లేదు. ఆక్యుపెన్సీ 20 శాతం కూడా దాటడం లేదు. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం, బంగారు గుడ్లు ఇచ్చే బాతును చంపుకోవడం అంటే ఇదే.