వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో పాము కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా సిబ్బంది, పేషెంట్లు భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ ఎంజీఎంలోని ఫీవర్ వార్డులోని టాయిలెట్ లో ఓ నాగు పాము ప్రత్యక్ష్యమయింది.
బాత్రూంలోకి వెళ్లిన అటెండర్స్ పామును చూసి భయబ్రాంతులకు గురి అయ్యారు. వెంటనే ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ఆర్ఎంవోకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు పాములు పట్టే వ్యక్తికి ఫోన్ కాల్ చేసి రప్పించారు.
అతడు వచ్చి పామును పట్టి ఓ సంచీలో వేసి, అటవీ అధికారులకు అప్పజెప్పాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎంజీఎం హాస్పిటల్ లో ఎలుకలు కొరికిన ఘటనలో ఓ పేషెంట్ మృతి చెందాడు. ఆ సమయంలో హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాము ఘటనతో ఎంజీఎం ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.