తల్లి జన్మనిస్తే,కూతురు ఆ తల్లికి పునర్జన్మనిచ్చింది. పాము కరిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని సమయస్ఫూర్తితో రక్షించుకోగలిగింది ఓ యువతి. విషపూరిత పాము కరిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లికి ప్రథమ చికిత్స అందించింది. పాము విషాన్ని తన నోటితో తీసి రక్షించింది.ఈ ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్లో జరిగింది.
ఈ ప్రమాదం వారం క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పుత్తూరులోని కేయూరు గ్రామానికి చెందిన మమత రాయ్, సతీశ్ రాయ్ భార్యభర్తలు. వీరికి శ్రామ్య రాయ్ అనే కుమార్తె ఉంది. ఈమె పుత్తూరులోని వివేకానంద కళశాలలో బీసీఏ చదువుతోంది.
కేయూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలైన మమత రాయ్.. రోజూలాగే చెట్లకు నీరు పట్టేందుకు పెరట్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెను ఓ విషపూరితమైన పాము కాటు వేసింది. దీంతో భయపడిన ఆమె హుటాహుటిన ఇంటిలోకి పరిగెత్తింది.
తల్లి పరిస్థితిని చూసిన కూతురు సమయస్ఫూర్తితో వ్యవహరించింది. విషం శరీరమంతా వ్యాపించకుండా.. తన నోటితో బయటకు తీసింది. అనంతరం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి.. పుత్తూరులోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని.. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.
కాలి నుంచే విషం తీయడం వల్ల పూర్తి శరీరంలోకి వ్యాపించలేదని వైద్యులు తెలిపారు. తన ప్రాణాలకు తెగించి మరీ తల్లిని కాపాడిన శ్రామ్యను వైద్యులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.