పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. నిర్వాహకులు నిర్లక్ష్యంగా దాన్ని విద్యార్థులకు అలాగే వడ్డించారు. దీంతో ఆ ఆహారాన్ని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఆ భోజనం చేసిన తర్వాత సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల కోసం వండిన పప్పు గిన్నెలో పాము కనిపించినట్టు పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు.
దీంతో ఆ భోజనం చేసిన వెంటనే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారందరిని రాంపుర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై మయూరేశ్వర్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి దీపంజన్ జానా స్పందించారు.
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తనకు దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే జిల్లా పోలీసు అదికారికి సమాచారాన్ని అందించినట్టు చెప్పారు. విద్యార్థులెవ్వరికీ ప్రాణహాని లేదని ఆయన వెల్లడించారు. ఒక విద్యార్థి మినహా మిగతా వారంతా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. ఘటనపై అక్కడ ఉన్న విద్యార్థులు, పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లి దండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. హెడ్ మాస్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.