నిలిచిపోయిన 40 పరిశ్రమలు
అనంతపురం: ఒక నాగు పాము కారణంగా 40 పరిశ్రమల్లో పని నిలిచిపోయింది. విద్యుత్ సంస్థకు 4 లక్షల నష్టం వచ్చింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో జరిగింది ఇది. తూమకుంట సబ్‌స్టేషన్‌లోని ఫీడర్‌లోకి ఓ నాగుపాము దూరడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి కాలిపోయింది. దీంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫీడర్‌లోకి నాగుపాము ప్రవేశించి విద్యుత్ పరికరాలను తాకడంతో అందులోని ఫ్యూజులు, క్లాంపులు, వైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచి ట్రాన్స్‌కోకు రూ.4లక్షల నష్టం వాటిల్లింది. తూమకుంట, గోళ్లాపురం పారిశ్రామికవాడలోని సుమారు 40 పరిశ్రమల్లో పనులు ఆగిపోయాయి. అలాగే దీనివల్ల శ్రీకంఠపురం-లేపాక్షి సబ్‌స్టేషన్‌లో సమస్య తలెత్తింది. ఏమి జరిగిందో తెలియక మొదట అధికారులు ఆందోళన చెందారు. చివరికి ఫీడర్‌లో పామును గుర్తించారు. మొత్తానికి నాగుపాము నానా హంగామా చేసింది.