గత కొద్ది రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలు చలి, పొగమంచుతో సతమతమవుతున్నాయి. జమ్ము-కశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీని వలన శ్రీనగర్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
దీంతో శ్రీ నగర్ నుంచి బయల్దేరాల్సిన విమానాల్ని ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విమానాలు రాకుండా దారి మళ్లించారు. ఉదయం పది గంటల సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విరామం లేకుండా మంచు కురుస్తుండటం, కాంతి సరిగ్గా లేకపోవడం, చాలా దూరం వరకు ఏమీ కనబడకపోవడం వంటి కారణాలతో అధికారులు విమానాల రాకపోకల్ని నిషేధించారు.
మరోవైపు కొన్ని పర్వత ప్రాంతాల్లో వర్షం కూడా కురుస్తోంది. పొగ మంచు కారణంగా సాధారణ జనజీవనం కూడా స్తంభించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. విమానాలు రద్దైన విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు. ఈ మేరకు టిక్కెటు ఛార్జీలు వెనక్కు ఇస్తామని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఎసియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలకు చెందిన విమానలు రద్దయ్యాయి.అలాగే ప్రయాణికులు కోరుకుంటే తర్వాత అందుబాటులో ఉన్న విమానాల్లో పంపిస్తామని అధికారులు చెప్పారు. ఏ సంస్థ టిక్కెట్ బుక్ చేసుకున్నప్పటికీ, అందుబాటులో ఉన్న సంస్థ విమానాల్లో పంపిస్తామన్నారు. మరో రెండు, మూడు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.