తెలుగుతెర అందాల నటుడు శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్ శోభన్ బాబు. శ్రీదేవి, జయప్రద, జయ సుధ లాంటి అందగత్తెల్నిఅతి సునాయాసంగా ప్రేమలో పడేసినా, విధి ఆడిన వింతనాటకంలో ఇద్దరిభార్యలకు ముద్దుల మొగుడై ప్రేమాను బంధాల మధ్య నలిగిపోయినా…ముంగురులను రింగు తిప్పినా శోభన్ బాబుకే చెల్లింది.
కుటుంబ కథా చిత్రాల ప్రవాహాన్ని కొనసాగిస్తూ విపరీతమైన లేడీఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు శోభన్. సోగ్గాడు సినిమాతో తనలోని కమర్షియల్ సక్సెస్ స్ట్రెంత్ ని తెలుగు తెరకు రుచి చూపించాడు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆల్ రౌండర్ అనిపించాడు. అయితే వయస్సు పైబడ్డాక సినిమాలకు దూరమవుతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు శోభన్ బాబు.
తన కుటుంబం నుంచి కూడా ఎవరినీ సినిమా రంగంలోకి వెళ్లనివ్వలేదు. అయితే హీరోగా నటిస్తున్న సమయంలోనే ఆయన తన సంపాదనతో ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. ముఖ్యంగా భూములను బాగా కొన్నారు. దీంతో ఆయన పిల్లలకు డబ్బుకు కొదువ లేకుండా పోయింది.
అందుకనే పిల్లల్ని సగం సినిమాలకు దూరం చేశారని అంటారు. ఇక అప్పట్లో ఏ హీరోకు లేని ఆస్తి శోభన్ బాబుకు ఉండేది. ఇక చెన్నైలో ఆస్తులను కూడబెట్టిన శోభన్ బాబు సినిమాలకు దూరం అయ్యాక అక్కడే సెటిలయ్యారు. ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నారు.
సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాక తన మాటకు తాను కట్టుబడ్డారు. ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమాకు మంచి పేరు వచ్చింది. అందులో పవన్ తో పాటు అతడి తండ్రిగా రఘువరన్ నటనకు కూడా మంచి స్పందన వచ్చింది.
అయితే రఘువరన్ పాత్రకోసం శోభన్ బాబుకి ఛాన్స్ వచ్చినా వదిలేశారు. అంతేకాదు అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం అడిగితే కాదన్నారట. అలా మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను వదిలేసుకున్నారు.
అయితే సినిమా రంగం అంటే ఉన్న అయిష్టత వల్లనే శోభన్ బాబు తన మాటకు కట్టుబడి ఇక సినిమాలు చేయలేదని అర్థం చేసుకోవచ్చు. అదే ఆయన మళ్లీ సినిమాల్లో నటించి ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేది. ఆయనను చూసేందుకే సినిమాలకు వచ్చేవారని కచ్చితంగా చెప్పవచ్చు.