హక్కులకు కూడా బాంచెన్ నీ దొరా అనాల్న..? - social activist akilesh kasani responds over rtc employees strike in telangana- Tolivelugu

హక్కులకు కూడా బాంచెన్ నీ దొరా అనాల్న..?

social activist akilesh kasani responds over rtc employees strike in telangana, హక్కులకు కూడా బాంచెన్ నీ దొరా అనాల్న..?

అభివృద్ధి చెందిన దేశాలల్ల కూడా రవాణాను సర్వీస్ కిందనే సూస్తరు.. దానికి లాభాలు, నష్టాలు బేరీజు వెయ్యరు.. ప్రజలకు విద్యా, వైద్యం, రవాణా అనేటియి కనీస అవసరాలుగా గుర్తిస్తరు..కానీ ఇక్కడికొచ్చేసరికి వ్యవస్థ కంటే వ్యక్తుల పూజ ఎక్కువైంది.. విద్యా, వైద్యం మొత్తం నాశనం చేసి ప్రైవేటు పరం చేస్తే సప్పుడు చెయ్యరు.. బడులు మూసేస్తున్నరు.. దవాఖానాలల్ల కనీస వసతులు ఉండయి.. కానీ ఎవలికన్న ఏమన్న అయితే సహాయ నిధి నుంచో, రికమెండేషన్ తోటో సహాయం అందితే సాలు మా సారు దేవుడు, మా అన్న తోఫు, మా అక్క నా గుండెకాయ అని భజన మీద భజన చేస్తరు.. అసలు మనకు కొన్ని హక్కులుంటయి అని కూడా మరిశిపోయి ఎక్కడికక్కడ మన బానిసత్వాన్ని ప్రదర్శించుకుంటున్నం..

దురదృష్టం ఏందంటే తెలంగాణల ఈ ధోరణి ఇంక ఎక్కువైంది.. మేధావుల నోళ్లు మూయించిర్రు.. పాటాపడి ఉత్తేజపరిచిన గళాలను పిసికేశిర్రు.. ప్రతిపక్షాలను జోకర్లను చేశిర్రు.. ఉద్యమకారులతోని ఊడిగం చేపించుకుంటుర్రు.. నోరెత్తితే నిర్భంధాలు.. ప్రశ్నిస్తే కేసులు.. మనకు రావలసినయి కూడా భిక్షగా పొందాల్సిన పరిస్థితి..

అసలు ఆర్టీసీని నష్టాల బాట పట్టిచ్చిందెవ్వరు..? గత, ప్రస్తుత పాలకులే కదా.. ప్రభుత్వం ఆదీనంలోకి తీస్కొని లాభాలు పంచొచ్చు కదా.. ఎన్నో పనికిరాని పథకాలతోని లక్షల కోట్లు అప్పు చేస్తున్నం.. రెండు మూడు వేల కోట్లే భారమైనయా..? ఇగ ప్రతీ దాన్ల పొదుపు పాటిస్తున్నట్టు ఈ లెక్కన.. అయినా ఆర్టీసీకి ఎన్నో ఆస్తులున్నయి.. పెద్ద పెద్ద కాంప్లెక్సులు కట్టి కిరాయికియ్యొచ్చు కదా.. ఒక మార్కెటింగ్ శాఖని పెట్టి ఆర్టీసీ ఆదాయం పెంచొచ్చు కదా.. బుడ్డ సారు ఏం చేస్తున్నట్టు..? టాస్క్ లెక్క ఆర్టీసీల ఒక శాఖ పెట్టొచ్చు కదా.. అధికారంలోకి రాకముందు ఆర్టీసీ నాయకులుగా చలామనీ అయిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏరు దాటంగనే ఆర్టీసీ బస్సుల దుమ్ము కొడతరా..?

ఏం మనుషులురాబై.. మనుషులు సస్తున్నా మీ గుండెలు కరుగుతలెవ్వా..? ఇంకా కూడా వ్యక్తిపూజ చేస్తున్నరంటే ఏమనుకోవాలే..

Share on facebook
Share on twitter
Share on whatsapp