మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దళిత మహిళకు చావుకు కారణమైనవారిని సస్పెండ్ చేస్తేనే సరిపోదని ఎస్.డి.ఎఫ్( సోషల్ డెమెక్రటిక్ ఫోరం) కన్వీనర్ రిటైర్డ్ ఐఎఎస్ ఆకునూరి మురళి అన్నారు. వారిని అరెస్టు చేయకుండా కేసీఆర్‌కు హుజురాబాద్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌కు బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్టు చేయాలని ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.
హైదరాబాదులో సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మరియమ్మ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆకునూరి మురళి మండిపడ్డారు. నిందితులైన పోలీసులను అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తన చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పటికీ అరెస్టు చేయకుండా నిందితులను కాపాడటం తగదన్నారు .దళిత సాధికారత అంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దళిత మహిళలకు జరిగిన అన్యాయానికి.. ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీశారు.