ఆధార్ ఐచ్చికమా? నిర్బంధమా? ఐచ్చికమనే గతంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా కంట్రోల్‌కు ఆధార్ అస్త్రంగా వాడే ప్రయత్నం జరుగుతోంది.
ఢిల్లీ: ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు ఓటర్ ఐడీలు, పాన్‌కార్డుల అనుసంధానానికి మాత్రమే పరిమితమైన ఆధార్ సంఖ్యను ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలకు అనుసంధానిస్తారా? దీనిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ అనుసంధానించడానికి చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తున్నారా? లేదా తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఇచ్చిన సమాధానం తర్వాతే ఫేస్‌బుక్ బదిలీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
జస్టిస్ దీపక్ మిశ్రా గుప్తా, అనిరుద్ధ బోస్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఫేస్‌బుక్ ఇంక్ వేసిన పిటిషన్‌ను విచారించింది. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు ఆధార్‌ను అనుసంధానించడంపై వివిధ హైకోర్టులలో పెండింగులో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ ఇంక్ బదిలీ పిటిషన్ దాఖలు చేసింది. గుర్తింపు ప్రామాణికత కోసం సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించాలని కోరుతూ గతేడాది జూలైలో మద్రాస్ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.
పేస్‌బుక్ బదిలీ పిటిషన్‌పై ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయమై తాము నిర్ణయం తీసుకోవాలా, హైకోర్టు నిర్ణయం తీసుకోవాలా అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడమంటే యూజర్ల స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని ఫేస్‌బుక్ పేర్కొంది. అయితే కేంద్రం దీనిపై ఏవిధంగా స్పందిస్తుంది? వ్యక్తిగత స్వేచ్చను కంట్రోల్ చేస్తుందా? అనేది వేచి చూల్సిందే!