ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియానే ప్రపంచం అయింది యువతకు. ఓ సెల్ఫీ తీయడం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం అందరికి అలవాటుగా మారింది. కానీ..కొందరు ఈ సోషల్ మీడియాను వాడుకొని యువతులను ట్రాప్ చేస్తున్నారు. వారి సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది.
పంజాబ్ లోని హోషియార్ పుర్ కు చెందిన జస్మీత్ సింగ్ కు ఓ యువతితో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. ఆమెతో కొంత కాలం చాటింగ్ చేశాడు. వీడియోకాల్స్ చేసి యువతిని మాటల్లోకి దింపాడు. ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేశాడు.
ఆ తర్వాత వీడియోలను తనకు పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించడం మొదలు పెట్టాడు. లేదంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మోసపోయానని గ్రహించిన యువతి ఏం చేయాలో అర్ధం కాక తల పట్టుకుంది. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బెదిరింపులకు పాల్పడిన యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇదే తరహా కేసులు ఏమైనా అతనిపై ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. నిందితుని వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు పోలీసులు.