సోషల్ మీడియా వల్ల ఎంత చెడు జరుగుతుందో అంతే మంచి కూడా జరుగుతోంది. సరైన విధంగా, తెలివిగా ఉపయోగించుకుంటే సోషల్ మీడియా ఒక వరమని చెప్పొచ్చు. దీని వల్ల సమాజంపై చెడు ప్రభావం పడుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఏ సోషల్ మీడియా వల్ల జరిగే మంచి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఏదైనా మనుషుల ఆలోచనలు బట్టి ఉంటుంది కదా. సోషల్ మీడియా అనేది సమాజాలు, సరిహద్దు, దేశాలు, ఖండాలు దాటి సన్నిహితులను ఒక చోట చేర్చడంలో అద్భుతాలు చేస్తోంది.
దీని వల్ల ఎన్నో సార్లు తప్పిపోయిన కుటుంబ సభ్యులు, విడిపోయిన స్నేహితులు ఒకటయ్యారు. ఇంతకు ముందు ఇలాంటి వార్తలు ఎన్నో విన్నాము. తాజాగా సోషల్ మీడియా కారణంగా మరో అద్భుతం జరిగింది. ఈ టెక్నాలజీ వల్ల 14 సంవత్సరాల క్రితం విడిపోయిన తల్లి కూతుర్లు ఒకటయ్యారు.వివరాల్లోకి వెళితే జాక్వలిన్ ఫెర్నాండెజ్ కు ఇప్పుడు 19 ఏళ్లు. ఈ నెల ప్రారంభంలో ఆమె ఫేస్ బుక్ ద్వారా తల్లి ఏంజెలికా వెన్సెస్ సల్గాడోను కలుసుకోగలిగింది. ప్రస్తుతం తాను మెక్సికో లో నివసిస్తున్నా అని చెప్పింది.
ఆరేళ్ల వయసులో ఎవరో ఎత్తుకుపోవడం, ఆ తరువాత ఎంత వెతికినా కన్పించకుండా పోయిన కూతురు మళ్లీ సోషల్ మీడియా ద్వారా ఇన్నాళ్లకు నీ కూతురుని అంటూ చెప్పడంతో ఆ తల్లి ఆనందానికి అంతే లేకుండా పోయింది. వెంటనే పోలీసులను తీసుకొని అమ్మాయి ఉన్న స్థలానికి వెళ్లి కూతురుని కలుసుకుంది. అలా 14 ఏళ్ల తర్వాత తల్లీకూతుళ్లను ఒక్కటి చేసింది సోషల్ మీడియా.