గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఓ గిరిజన బిడ్డగా మంగ్లీ కనీసం స్పందించదా…? అంటూ మట్టిలో మాణిక్యంగా ఎదిగిన ప్రముఖ గాయని మంగ్లీపై కొన్ని రోజులుగా విష ప్రచారం జరుగుతోంది. సింగరేణి కాలనీలో 6ఏళ్ల పాపపై హత్యాచారం జరిగితే మంగ్లీ కనీసం స్పందించలేదని, ఎదిగే వరకు ఒకలా… ఎదిగాకా ఒకలాగా ఉంటారా అని సోషల్ మీడియా మండిపడింది.
ఎన్నో మట్టి మనుషుల పాటలతో జనాన్ని అలరించే మంగ్లీపై వచ్చిన ఆరోపణల్లో పూర్తిగా నిజం లేదు. సోషల్ మీడియాలో వచ్చినట్లుగానే మొదట తొలివెలుగు కూడా మంగ్లీ పరామర్శకు రాలేదని విమర్శించింది. కానీ మంగ్లీ అప్పటికే ఆ పాప కుటుంబాన్ని పరామర్శించిందని ఆలస్యంగా తెలిసింది. ఇలాంటి ఘటనల్లో స్పందించిన వారికి తొలివెలుగు మద్దతుగా ఉంటూ స్పందించని వారిని నిలదీస్తూనే ఉంటుంది. తను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ మంగ్లీ ముందుగానే ఆ చిన్నారి కుటుంబాన్ని స్వయంగా కలిసింది. ఆ తల్లిని ఓదార్చింది. ఆ తల్లి బాధ చూసి తను కూడా కన్నీరు పెట్టింది. ఇంత ఘోరం చేసిన ఆ మృగాడిని కఠినంగా శిక్షించాలని, మరోసారి లైంగిక వేధింపులు అనే పదమే వినపడకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisements
ఆ కుటుంబాలు కష్టం చేసుకొని బ్రతికే కుటుంబాలు. ఎంతో కష్టపడి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోవటం ఎంతో బాధేసిందని, గిరిజన తండాల్లో ఎంత కష్టం ఉందో స్వయంగా చూసిన దాన్ని అంటూ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు విషయం తెలిసిన వెంటనే వెళ్లి పరామర్శించి వచ్చానని, అయినా కొందరు తనపై తెలిసీ తెలియక విష ప్రచారం చేస్తున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.