ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పగలూ ప్రతీకారాల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ల తాట తీస్తామంటూ పోలీసులు వార్నింగులు ఇవ్వడమే కాకుండా కేసులు కూడా పెడుతున్నారు. తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకోకుండా అధికార పార్టీ వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు పెడుతున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. అసలేం జరుగుతోంది.. సమగ్ర సమాచారం ఇది..
గుంటూరు అర్బన్ పరిధిలో కొత్తపేట పోలీసులు ఇటీవల కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన రావి కృష్ణవంశీ, ఆతుకురు గ్రామానికి చెందిన బొబ్బిలి శరత్‌చంద్రరాయ్‌లపై కేసులు పెట్టారు. ఈ ఇద్దరూ చందు బొబ్బిలి అనే ఐడీ నుంచి ముఖ్యమంత్రి ఫోటోను మార్ఫింగ్ చేసి అవమానకరమైన పోస్టింగ్ పెట్టారనేది ఆభియోగం. వారిపై కేసులు పెట్టి కోర్టులో హాజరుపర్చి కటకటాల వెనక్కు పంపారు.
సీయం ఫోటో మార్ఫింగ్ చేసి అవమానకరంగా కామెంటు చేశారనే అభియోగంతో శ్రీకాకుళం జిల్లా సరసనపల్లి గ్రామానికి చెందిన పణతల హరికుమార్ అనే యువకుడిపై గుంటూరు ఆరండల్‌పేట పోలీసులు మరో కేసు నమోదు చేసి కేసులు పెట్టి అతన్ని కూడా కటకటాల్లోకి నెట్టారు.
వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపేలా, వారి కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యేలా అసభ్య చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని, తక్షణమే వాటిని తొలగించాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు. సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని కించపరుస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఇంతకుముందే టీడీపీ 33 ఫిర్యాదులు చేసిందని, పోలీసులు కనీసం కొన్నింటిపైన కూడా కేసులు నమోదు చేయలేదని రామయ్య ఆరోపించారు. గతంలో ఇచ్చిన 33 ఫిర్యాదులు, ఇప్పుడిచ్చిన 16 ఫిర్యాదులు రామయ్య లెక్క కట్టి చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించి ఇక మీదట ఎవరూ ఈ విధమైన పోస్టింగ్‌లు పెట్టకుండా పోలీసులు చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
కానీ, పోలీసులు ఇంతవరకు తమపై పెట్టిన పోస్టింగ్స్‌పై ఎటువంటి చర్య తీసుకోకపోగా, రివర్స్‌లో తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా గ్రూపుల్ని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలీస్ శాఖపై తీవ్ర ఆరోపణ చేస్తోంది.
దీనిపై ఇవాళ టీడీపీ నేత ప్రెస్ మీట్ పెట్టి మరీ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. వైసీపీ కార్యకర్తలు తమపై అసభ్యంగా ఎన్ని పోస్టులు పెడుతున్నా ఒక్క కేసు కూడా పెట్టకుండా వారికి ఇంకా ఊతమిచ్చేలా ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపైనా, తన పార్టీ నేతలపై చేస్తున్న ప్రచారం దారుణం అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చంద్రబాబు గురువారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
స్వర్గస్తులైన నారా చంద్రబాబునాయుడు అంటూ పోస్టు చేశారని కొన్ని పోస్టుల్ని చూపించారు. ‘నువ్వు ఎన్ని లుచ్ఛా పనులు చేసినా, పైకి పోయావు కాబట్టి సానుభూతి ప్రదర్శిస్తున్నాం, జోహార్ చంద్రబాబు’ అంటూ కామెంట్ పెట్టారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నది ఇలాంటి వెధవ పనులు, వెధవ మాటలు వినడానికా? అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఆంబోతులు ఓ నేరచరిత కలిగిన వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఏంచేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసునని అన్నారు.
మాచర్లలో ఓ మహిళ తన కాళ్లు పట్టుకుని గోడు వెళ్లబోసుకుంటే దాన్ని కూడా వ్యంగ్యంగా మార్చేశారని ఆరోపించారు. బాధిత మహిళ స్థానంలో లోకేష్ ముఖాన్ని మార్ఫింగ్ చేశారని చెప్పి ఆ క్లిప్పింగ్‌ను చూపించారు. లోకేశ్ తన కాళ్లు పట్టుకోవడానికి రాగా, ఎక్కడో చూసినట్టుంది ఈమెను అంటూ తాను అడిగినట్టు, ఫిమేల్ ఆర్టిస్టులు ఎవరూ రాలేదు నాన్నారూ, నేనే చీరకట్టుకుని వచ్చా అంటూ లోకేశ్ చెప్పినట్టు చిత్రీకరించారని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చింతమనేని ప్రభాకర్‌పై పెట్టిన పలు పోస్టులను ప్రదర్శించారు. తూర్పు గోదావరి నుంచి వచ్చిన ఓ అమ్మాయిని కించపరుస్తూ పోస్టులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. అసలు వీళ్లకు సిగ్గుందా? బుద్ధుందా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టులన్నీ డీజీపీకి ఇచ్చామని, కానీ డీజీపీకి ఇవేమీ కనిపించడం లేదని అన్నారు.
మొత్తం మీద ఏపీలో సోషల్ మీడియా వార్ నడుస్తోంది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు వందలాది మైక్రో బ్లాగ్స్, వెబ్ సైట్స్, సోషల్ మీడియా గ్రూపులు పనిచేసేవని, వాటిని నెమ్మదిగా జనంలోకి వదిలి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చాపకింద నీరులా సాగించేవారని చెబుతారు. వీటన్నింటికీ పీకే గ్రూప్ నేతృత్వం వహిస్తోందని అప్పట్లో చంద్రబాబు అనేవారు.
అనూహ్యంగా ప్రతిపక్ష స్థానంలోకి వచ్చిపడ్డ టీడీపీకి ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారం చాలా అవసరం అని కొంతమంది నేతలు చెబుతున్నప్పటికీ చంద్రబాబు వీటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వద్దని ఖరాకండిగా చెప్పేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా నెగటీవ్ క్యాంపేయిన్‌ను అధికార పక్షం నుంచి ఎదుర్కోవలసి రావడం ఆ పార్టీకి పెద్ద ట్విస్ట్.