అయిదు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. ఈ పొలిటికల్ లైఫ్ లో చాలాకాలం పాటు సోషలిస్టు నేతగా దేశంలో పాపులర్ అయ్యారు. నిన్న రాత్రి కన్ను మూసిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్.. జీవితంలోని ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుంటే ఎన్ని మలుపులు తిరిగిందో , దేశ రాజకీయాలను ఆయన ఎలా ప్రభావితం చేయగలిగారో విశ్లేషించుకోవలసిందే.. 1947 జులై 1 న మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా బబాయ్ గ్రామంలో జన్మించిన శరద్ యాదవ్. .1970 ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పటినుంచే క్రమంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.
1974 లో మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన విపక్ష అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీఫై ఆయన పొలిటికల్ ఫైట్ ప్రారంభమైంది. ఎమర్జన్సీ అనంతరం 1977 లో మళ్ళీ లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఎమర్జన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది నేతల్లో శరద్ యాదవ్ కూడా ఒకరు. 1979 లో లోక్ దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తరువాత ఎనిమిదేళ్ళకు.. 1987 లో వరుస పరిణామాల అనంతరం 1988 లోవి.పి.సింగ్ నేతృత్వంలో జనతాదళ్(జేడీ) ని ఏర్పాటు చేశారు.
నాడు 1989-90 మధ్యకాలంలో సింగ్ సంకీర్ణ ప్రభుత్వంలో స్వల్ప కాలంపాటు ప్రధానిగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో యాదవ్.. జౌళి,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 1990 ముగుస్తుండగా మాధేపురా లోక్ సభ నియోజకవర్గంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆయన పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఏబీ. వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.
1997 లో జనతాదళ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, 1999 లో పార్టీ రెండుగా చీలిపోయింది. నాడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో తన పార్టీని భాగస్వామి చేశారు. అయితే హెచ్.డీ. దేవెగౌడ ఆధ్వరంలోని వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన సొంత పార్టీని ఏర్పాటు చేసింది. . అదే జనతాదళ్-(సెక్యులర్) అయింది. 2006 లో శరద్ యాదవ్ తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడమేగాక.. 2009 లో మాధేపురా నుంచి తిరిగి ఎన్నికయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో జేడీ-యు ఓటమి చెందడంతో నితీష్ కుమార్ తో ఆయన సంబంధాలు మారిపోయాయి. ఆ తరువాత సొంతంగా లోక్ తాంత్రిక్ జనతాదళ్ ని ఏర్పాటు చేసిన యాదవ్.. 2020 మార్చిలో దాన్ని లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ లో విలీనం చేశారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వాల్లో పని చేయడం, మొదట తన మిత్ర పక్షాల నేతలతో చేతులు కలిపి ఆ తరువాత వారితో విభేదించడం,మళ్ళీ వారికి చేరువ కావడం శరద్ యాదవ్ రాజకీయ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పాయి.