హైదరాబాద్ గచ్చిబౌలిలో మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్.. నగరంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన ప్లాట్ లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటోంది. ఒక స్నేహితురాలు ఢిల్లీ వెళ్లగా.. మరో స్నేహితురాలు ఆఫీస్ వెళ్లింది. దీంతో.. ప్లాట్ లో ఎవరూ లేని సమయంలో కృతి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే.. తను ఆత్మహత్య చేసుకునే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్ కు.. తాను చనిపోతున్నట్లు వాట్సప్ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసి షాక్ తిన్న సచిన్.. కృతి ఉంటున్న ప్లాట్ దగ్గరకు చేరుకున్నాడు. రూమ్ కు తాళం వేసి ఉండటం చూసి.. కృతికి కాల్ చేశాడు. ఎంతకూ ఫోన్ కాల్ కు స్పందించకపోవడంతో.. రూమ్ తలుపులు పగల గొట్టి లోనికి వెళ్లాడు.
అప్పటికే కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో.. పోలీసులకు సమాచారం అందించిన సచిన్.. వెంటనే కృతిని హాస్పిటల్ కు తరలించాడు. అయితే.. అప్పటికే కృతి మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.
Advertisements
ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. చిన్న పాటి సమస్యలకు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులు వివరించారు.