ప్రేమ కోసం యువత దేనికైనా తెగిస్తుంది. ఇతరుల ప్రాణాలు తీయడమో.. లేక వారి ప్రాణాలు తీసుకోవడానికైనా లెక్క చేయడం లేదు. తాజాగా తాను ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామానికి చెందిన అఖిల్.. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా అఖిల్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్యా ఏవో మనస్పర్ధలు రావడంతో ఆ అమ్మాయి అఖిల్ తో మాట్లాడటం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అఖిల్.. శుక్రవారం ఓ లాడ్జ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు.
శనివారం ఉదయం ఎంతసేపటికీ అఖిల్ బయటకు రాకపోవడంతో.. లాడ్జ్ సిబ్బంది కిటికీలో నుంచి చూడగా, అఖిల్ తాడుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే లాడ్జ్ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లాడ్జికి చేరుకున్న పోలీసులు.. అఖిల్ చనిపోయిన గది నుంచి ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తాను ప్రేమించిన యువతి తనతో మాట్లాడడం లేదని, తన ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టిందని అఖిల్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.