ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంచి ఆహారపు అలవాట్లు, సరైనా జీవన విధానం అనుసరించే..సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కేవలం 40 ఏళ్ల కే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీలో ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
జిమ్ చేసి తిరిగి ఇంటికి బయల్దేరిన క్రమంలో సడెన్‌గా గుండెపోటు రావడంతో సాయిప్రభు (25) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. స్నేహితులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. మే 3న అతనికి పెళ్లి నిశ్చయించామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని బోరున విలపించారు.
తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్ పల్లిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విశాల్.. జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.
గురువారం తన విధులను ముగించుకొని సికింద్రాబాద్ లోని ఓ జిమ్ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జిమ్ సిబ్బంది అతనిని వెంటనే హస్పిటల్ కి తరలించగా, అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.
పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ!
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ వివాహానికి పెళ్లికొడుకు సమీప బంధువు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం(19) హాజరయ్యాడు. శనివారం ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారు పరిశీలించగా అపస్మారక స్థితికి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.