సర్కార్ నిర్లక్ష్యం.. మరొకరి ప్రాణం మీదకు తెచ్చింది. హైదరాబాద్‌లో మణికొండలోని డ్రైనేజీలో పడి గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ జాడ ఇంకా దొరకలేదు. రజనీకాంత్ కోసం రెండు డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్ చెరువు వద్ద కూడా అన్వేషిస్తున్నారు. కానీ ఫలితం లేకుండాపోయింది.
షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు రజనీకాంత్. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన… తన ఇంటికి అత్యంత సమీపంలోనే నిర్మాణంలో ఉన్న ఓ డ్రైనేజీ గుంతలో పడి కొట్టుకుపోయాడు. రోజూ చూసే దారి, ప్రాంతమే అయినా డ్రైనేజీ వర్షపు నీటితో నిండిపోయి ఉండటం.. ప్రమాద హెచ్చరిక సూచికలేవీ లేకపోవడంతో అందులో పడ్డాడు. ప్రమాద స్థలానికి, అతని ఇంటికి మధ్య కేవలం 50 మీటర్ల దూరమే ఉంది.
మరోవైపు ప్రమాద స్థలాన్నిమంత్రి సబితా ఇంద్రారెడ్డి , చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటన బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడుతున్న సమయంలో నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సి అవసరం ఉందన్న ఆమె.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామన్నారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై నగరవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకా ఎంత మంది బలి కావాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. వర్షాలు పడే సమయంలో పనులు చేయవద్దని తెలిసినా… ఇంత నిర్లక్ష్యమా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఘటకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.