– నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు
– క్వారీ మాదిరిగా తలపిస్తున్న చెరువు
– ఏదైనా జరిగితే బాధ్యులెవరు
– కొకట్ గ్రామస్థుల ఆవేదన
వికారాబాద్ జిల్లా యాలాల మండలం కొకట్ గ్రామంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తాండూరు పట్టణం బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం నిబంధనలకు విరుద్ధంగా చెరువు నుంచి మట్టిని తోడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయని వీటి ద్వారా జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని నిలదీశారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ గ్రామ సమీపంలోని తొర్రి చెరువు నందు నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో 20 ఫీట్ల లోతుగా మట్టిని తోవ్వి అక్రమంగా తరలిస్తున్నారు ఆరోపించారు.
మట్టి తరలింపుపై పలుసార్లు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేసిప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని వాపోయారు. మట్టి తవ్వకాల వల్ల చెరువు మొత్తం ఒక క్వారీ మాదిరిగా తయారైందని చెప్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై అక్రమంగా మట్టి తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తీరిక లేకుండా వాహనాలు తిరుగుతుండటంతో ఎప్పుడ ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో అటుగా వెళ్లలేకపోతున్నామని చెప్తున్నారు గ్రామస్థులు. ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు గ్రామస్థులు. చెరువును లోతుగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఎండాకాలంలో పశువులు తాగేందుకు కూడా నీరు లేకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.
ఇప్పటికైనా అక్రమ మట్టి తరలింపు ఆపకపోతే.. పరిస్థితులు తారుమారు అవుతాయని హెచ్చరించారు. అడిగే వారు లేరని అడ్డగోలుగా తవ్వకాలు జరిపితే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి.. మట్టి తరలింపును నిలిపి వేయాలని.. లేదంటే ఆందోళనలకు పిలుపునిచ్చి ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. గ్రామస్థులంతా కలిసి మట్టి తరలించే వాహనాలను అడ్డుకుంటామంటున్నారు.