కిన్నెరసాని,ముర్రేడువాగు నదుల వెంట ముంపునకు గురయ్యే ప్రాంతాలను వీలైనంత త్వరగా గుర్తించి నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్ట అథారిటీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఆయా ప్రాంతాలను గుర్తించాలని గతంలోనే సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తెలిపింది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని పోలవరం చీఫ్ ఇంజినీరు ఆదేశించడంతో పాటు తక్షణమే నివేదిక పంపాలని స్పష్టం చేసింది.
అయితే పోలవరం ప్రాజెక్టుకు ముంపే పెద్ద శాపంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్య తీవ్రత పెరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది. తమ రాష్ట్రంలో ముంపు సమస్యలకు సంబంధించి పరిష్కారాలను చూపాకే ముందుకు వెళ్లాలని అథారిటీ అధికారులకు తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి సర్వసభ్య సమావేశం కూడా జరిగింది.
ఈ సమావేశంలో పోలవరం రిజర్వాయర్ వెనుక జలాలకు సబంధించిన సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. అయితే వర్షాకాలంలో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో 892 ఎకరాలు ముంపుకు గురయ్యాయి.