ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సార్లు విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్లను ఓపెన్ చేశారు అధికారులు. లాక్ ఓపెన్ సమయంలో కవిత తరఫున న్యాయవాది సోమా భరత్ ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. వరుసగా రెండోరోజు కూడా ఆయన్ను అధికారులు పిలిచారు.
విచారణలో భాగంగా కవిత తన ఫోన్లను ఈడీకి అప్పగించారు. వాటిని యాక్సెస్ చేయడానికి కవిత లేదా ఆమె తరఫున ప్రతినిధి రావాలని మంగళవారం నోటీసులు ఇచ్చారు అధికారులు. కవిత ప్రతినిధిగా సోమా భరత్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన సమక్షంలోనే కవిత ఇచ్చిన ఫోన్లను యాక్సెస్ చేసి.. డేటాను సేకరిస్తుట్టుగా తెలుస్తోంది.
ఈ నెల 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీ అధికారులకు ఇచ్చారు. కవిత మొబైల్స్ లో డేటా, ఇతర అంశాలపై భరత్ ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే.. మరోసారి విచారణకు పిలవలేదని కేవలం వారికి ఉన్న అనుమానాలను క్లియర్ చేసుకునేందుకు పిలిచినట్లు సోమా భరత్ అంటున్నారు.
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎందుర్కొంటున్న కవిత.. ఇప్పటి వరకు ఈడీ అధికారుల ముందు మూడు సార్లు హాజరయ్యారు. కవిత ఫోన్లు మార్చారని.. మరిన్ని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో మొత్తం 36 మంది 70 ఫోన్లు మార్చారని ఆరోపిస్తూ వస్తోంది.