కవిత ఈడీ విచారణలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని.. విచారణకు రాలేనని కవిత స్పష్టం చేశారు. అయితే.. ఈడీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. విచారణకు రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ సందర్భంగా కవిత ఈడీకి పంపిన లేఖపై చర్చ సాగుతోంది.
కవిత పంపిన లేఖలోని అంశాలు
తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు కవిత. సుప్రీం నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లలో లేదని.. అందుకే లాయర్ తో మీరు అడిగిన డాక్యుమెంట్స్ పంపించానని ఈడీకి తెలిపారు. అలాగే, సమన్లలో తన ఫోన్ సీజ్ చేసినట్టు ప్రస్తావించలేదని అన్నారు కవిత.
ఈడీ ఆఫీస్ దగ్గర కవిత లాయర్ ఏమన్నారంటే?
కవిత తరఫున ఈడీ ఆఫీస్ కు సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గత విచారణలో ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 15 కింద మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలను ఇంటికొచ్చి విచారించాల్సి ఉందని.. అదే విధంగా సాయంత్రం ఆరు గంటలలోపు విచారణ పూర్తి చేయాలని.. గత విచారణలో రాత్రి 8.30 గంటల వరకు ఆఫీసులోనే ఉంచడం ఏంటని ప్రశ్నించారు. ఈడీ అధికారుల విచారణ తీరు బాగోలేదన్న లాయర్.. మహిళగా కవితకు ఉన్న హక్కులను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
కవిత తరఫున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు సోమా భరత్. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందని గుర్తు చేశారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని.. ఈడీ ఎలాంటి నోటీసు, డేట్స్ ఇవ్వలేదని వెల్లడించారు.