కొంతమంది విదేశీ గడ్డలో కూర్చుని భారత ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. . ప్రస్తుతం లండన్ లో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన.. భారత ప్రజాస్వామ్యం అతి గొప్పదని, విదేశీ గడ్డపైనే గురు బసవేశ్వర విగ్రహం ఉందని అన్నారు. 2015 నవంబరు 14 న మోడీ లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలు, మానవాళిని నమ్మే ప్రతివారికీ 12 వ శతాబ్దం నాటి ఈ సాంఘిక సంస్కరణకర్తే స్ఫూర్తి అని ఆయన ఆనాడే వ్యాఖ్యానించారు.
ఆదివారం కర్ణాటకలో జరిగిన కార్య్రక్రమంలో మాట్లాడిన మోడీ.. భగవాన్ బసవేశ్వరునికి చెందిన ఈ భూమిలో ఉండడం తాను చేసుకున్న అదృష్టమని .. ఆయన చేబట్టిన సామాజిక సంస్కరణలు నేటికీ ప్రాధాన్యం వహిస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం ప్రపంచమంతా అధ్యయనం చేస్తుందని, ఈ నేపథ్యంలో ఇండియా అతి పెద్ద ప్రజాస్వామిక దేశమే గాక.. ఇది ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని ఆయన పేర్కొన్నారు.
‘లండన్ లో నాడు బసవేశ్వరుని విగ్రహావిష్కరణకు నన్ను ఆహ్వానించడం నేను చేసుకున్న అదృష్టం.. కానీ కొంతమంది లండన్ లో కూర్చుని మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం దురదృష్టకరం ‘అని మోడీ అన్నారు. ఈ దేశ డెమాక్రసీని బలహీనపరిచే శక్తి ఏదీ లేదన్నారు. అయితే ఈ వ్యక్తులు ఓ విదేశీ గడ్డ మీద అదేపనిగా డెమాక్రసీపై దాడి జరుగుతోందని ఆరోపిస్తున్నారని, వీరు బసవేశ్వరుడిని అవమానపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి వ్యక్తులకు కర్ణాటక ప్రజలు, ఆ మాటకొస్తే భారతీయులంతా దూరంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు.
కేంబ్రిడ్జ్ లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రధాని మోడీ ప్రజాస్వామ్య వ్యవస్థలను తన చెప్పు చేతల్లో ఉంచుకుని మీడియాతో సహా కీలక వ్యవస్థలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను మోడీ నేడు పరోక్షంగా తిప్పికొట్టారు.