లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ వేదికలపై భారత ఆధిపత్యం పెరుగుతున్న సమయంలో కొంతమంది విదేశీ భూమిపై మన దేశాన్ని విమర్శిస్తున్నారంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఈ రోజు కొందరు భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఆ వ్యక్తులే గతంలో తమకు అవకాశం దొరికినప్పుడు దేశంలో ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తీసుకు వస్తున్నారని చెప్పారు. కానీ కొందరు మాత్రం దేశం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వ్యక్తులు తాము విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని విమర్శిస్తారన్నారు. వాళ్లు కేరళలో వున్నప్పుడు యూపీని, ఢిల్లీలో వున్నప్పుడు కేరళపై విమర్శలు గుప్పిస్తారని పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయాలనుకునే వాళ్ల కుటుంబ వారసత్వాన్ని, విభజించి పాలించే రాజకీయాలను ప్రజలు గుర్తించాలన్నారు. వారు తమ దుర్మార్గపు ఆలోచనల్లో విజయం సాధించకుండా ప్రజలు చూడాలన్నారు.