తెలంగాణలో పార్టీని బ్రతికించుకునేందుకు అధిష్టానం చేతిలో చివరి అవకాశంగా పీసీసీ అధ్యక్ష నియామకం ఉందన్నది బహిరంగ రహస్యమే. నేతలంతా ఎవరికి వారు పీసీసీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నా…పోరాడుతూ, పనిచేసే వారికే పదవి అన్న సంకేతాలను ఇప్పటికే పార్టీ నాయకత్వం పంపించింది.
కానీ తమను ఎక్కడ పక్కన పెడతారో అన్న భయం కొంతమంది నేతల్లో బలంగా ఉంది. అందుకే కులం కార్డు, సీనియారిటీ వంటి పలు అంశాలను తెరపైకి తెస్తున్నారు. రహస్యంగా, ప్రత్యేకంగా మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కానీ అధిష్టానమే ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ను రాష్ట్రానికి పంపింది. సరైన నేతను మీరే చూడండి అని పంపగా… సీనియర్లు, మేమే పనిచేయగలం అని వాదిస్తున్న నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని బట్టి వారికి పీసీసీ వచ్చే అవకాశం లేదని అర్థమవుతుందని, రేవంత్ వంటి నాయకులకు పీసీసీ రాకుండా అడ్డుకునే ప్రయత్నమే ఇదంతా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.