మూడేళ్లుగా కాంగ్రెస్ తనను విస్మరించిందని ఇటీవల కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తు్న్నాయి.
సొంత పార్టీపై ఆయన శుక్రవారం విరుచుకుపడ్డారు. మరో వైపు బీజేపీ గురించి కొన్ని మంచి విషయాలను మనం గుర్తించాలన్నారు. వాటిని మనం తప్పకుండా అంగీకరించి తీరాల్సిందేనన్నారు.
రాజకీయంగా ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాలను మనం గమనించాలన్నారు. అలాంటి చర్యలు తీసుకునే శక్తి వారికి మాత్రమే ఉందని మనం అంగీకరించాలన్నారు.
బీజేపీ పక్షం వహించకుండా లేదా ఆ పార్టీని ప్రశంసించకుండా, కనీసం వాస్తవాన్నైనా మనం గుర్తించగలమని తాను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ బలపడాలంటే పార్టీ నిర్ణయాత్మక నైపుణ్యాలను, నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు.
బీజేపీలో చేరతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను ఎవరితో సంప్రదింపులు జరపలేదన్నారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన చెప్పారు.