తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలకు కసరత్తు జరుగుతుంది. గతంలోనే దీనికి సంబంధించి కొంత కసరత్తు చేసిన సర్కార్ తాజాగా సీఎస్ మార్పు నేపథ్యంలో మార్పులు,చేర్పులు అనివార్యమని భావిస్తోంది. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ అధికారుల వరకు పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ బదిలీలుంటాయని చర్చ జరుగుతోంది. అయితే హైకోర్టు తీర్పు,డీఓపీటీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ రిలీవ్ అయ్యి ఏపీ కేడర్ కు వెళ్లారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారిని, రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ గా నియమించగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఐఏఎస్ పోస్టింగుల్లో మార్పులు,చేర్పులు అనివార్యమైంది.
సోమేశ్ కుమార్, సీఎస్ పదవితో పాటు రెవెన్యూ,వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా,సీసీఎల్ఏ, రెరా ఛైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆ శాఖలు, బాధ్యతలు ఖాళీగా ఉన్నాయి. నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారి ఇప్పటి వరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ శాఖ ప్రస్తుతం ఖాళీ అయింది.
అయితే ఇప్పటికే పలు శాఖలకు పూర్తి స్థాయి కార్యదర్శలు లేకపోవడంతో అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని కొందరు అధికారులు కోరుతున్నారు. మాణిక్ రాజ్, రజత్ కుమార్ , షైనీ, ప్రీతిమీనా తదితరులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్తున్నారు. దీంతో వారు ఇప్పటి వరకు నిర్వరిస్తున్న బాధ్యతల్లో మరొకరిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పలువురు అధికారులు దీర్ఘకాలంగా ఒకే బాధ్యతల్లో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎక్కువ రోజులుగా ఉన్నారు. హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు కాకుండా ఇన్ ఛార్జులే ఉన్నారు. వీటిన్నింటి దృష్ట్యా తెలంగాణలో ఐఏఎస్ ల పోస్టింగుల్లో మార్పులు,చేర్పులు అనివార్యమయ్యాయి.