తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంట సేపు జగన్ తో భేటీ అయ్యారు. సోమేశ్ కుమార్ తో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నారు.
అంతకు ముందు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో మాట్లాడిన సోమేశ్ కుమార్.. ప్రభుత్వ అధికారిగా ఏపీ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని అన్నారు. డీవోపీటీ ఆదేశాల మేరకే తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేస్తానని చెప్పారు. సోమేశ్ కుమార్ కు ఏపీ క్యాడర్ కు వెళ్లాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ ను ఆశ్రయించడంతో 2016 లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు.
అయితే ఏపీ కేడర్ గా హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఆ రాష్ట్రానికి వెళ్తారా లేక రిజైన్ చేస్తారా లేక వీఆర్ఎస్ తీసుకుంటారా అనే సస్పెన్స్ కొనసాగింది. ఏపీ రాష్ట్రానికి వెళ్లడానికి సుముఖంగా లేరనే వార్తలు వినిపించినప్పటికీ పబ్లిక్ సర్వెంట్ గా ఎక్కడైనా పనిచేయడానికి మానసికంగా సిద్ధం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన పదవీ కాలం ఈ ఏడాదీ చివరి వరకూ ఉన్నందున ఒక సంవత్సర కాలాన్ని వృథా చేసుకోవాలనే ఆలోచన లేనట్లు సమాచారం. స్థాయితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా కంటిన్యూ చేయాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది.