ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు సీఎస్ సోమేష్ కుమార్. ప్రగతి భవన్ కు వెళ్లిన ఆయన సీఎంతో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం, సీఎస్ భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
సోమేష్ కుమార్ కు క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు మంగళవారం ఉదయం కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. కానీ, ఆయన తెలంగాణకే మొగ్గు చూపారు.
తనను ఏపీకి కేటాయించడంపై కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. తాజాగా దీనిపై వాదనలు జరగగా.. ఆ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. సోమేష్ కుమార్ న్యాయవాది తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని కోరారు.
కానీ, ఎలాంటి సమయం ఇవ్వలేదు హైకోర్టు. సోమేష్ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను సోమేష్ కలవడం హాట్ టాపిక్ గా మారింది.