– పెరిగిన సలహాదారుల సంఖ్య
– రాష్ట్రంలో రిటైర్డ్ అధికారులదే హవా
– ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే యంగ్ ఆఫీసర్స్
– సోమేష్ రాకతో ఐఏఎస్ వర్గాల్లో ఆందోళన?
– సీఎస్ గా ఉన్నప్పుడే అదనంగా 7 శాఖలు
– ఇప్పుడు వ్యవహారం ఎలా ఉంటుందనే భయం
– నేతల్లోనూ మాజీ సీఎస్ గుబులు
క్రైంబ్యూరో, తొలివెలుగు:తెలంగాణలో పదవి ముగిసిన ఆఫీసర్స్ దే హవా కొనసాగుతోంది. వారు చెప్పిందే వేదం. వారిచ్చిన రిపోర్టు కీలకం. కొంతమంది మంచి కోసం పని చేస్తుంటే.. మరికొందరు అక్రమ సంపద కోసం ఆ పోస్ట్ ను వదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లాబీయింగ్ లు చేసి ప్రభుత్వ పెద్దలతో కలిసి పుష్కర కాలంగా కొనసాగుతున్నారు. ఐఏఏస్, ఐపీఎస్ లుగా రిటైర్డ్ అయిన అధికారులను సలహాదారులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకోవడం కామన్ గా మారింది. రాజీవ్ శర్మ చీఫ్ సెక్రెటరీగా రిటైర్డ్ అయిన తర్వాత చీఫ్ అడ్వైజర్ గా 2016లో నియమించుకున్నారు కేసీఆర్. ఎస్కే జోషి ఇరిగేషన్ సలహాదారుడిగా ఉన్నారు. కేవీ రమణాచారి 9 ఏండ్లుగా కల్చర్, మీడియా సలహాదారుడిగా ఉన్నారు. ఫైనాన్స్ లో ఐఆర్ఎస్ ఆఫీసర్ జీఆర్ రెడ్డి ఉన్నారు. ఇక డీజీపీగా రిటైర్డ్ అయిన అనురాగ్ శర్మ శాంతిభద్రతల సలహాదారుడిగా ఉన్నారు. మాజీ డీజీ ఏకే ఖాన్ మైనార్టీ వెల్ఫేర్ లో కొనసాగుతున్నారు. వీరందరూ కేబినేట్ హోదాలో ఉన్నవారే. ఇప్పుడు సోమేష్ కుమార్ ని చీఫ్ అడ్వైజర్ గా మూడేళ్లు నియమించడంతో మిగతా ఆఫీసర్స్ లో అసంతృప్తి మొదలైందనే చర్చ జరుగుతోంది.
వామ్మో సోమేష్!
ఆదాయం రాబట్టడంలో సోమేష్ కుమార్ ని మించిన అధికారి లేరని సీఎం నమ్మకం. బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఎన్నికల ముందు ఆదాయం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. భూములను అమ్మకం, రెగ్యులరైజ్ చేయడం. లిక్కర్ పై రెవెన్యూ పెంచడం లాంటివి సుతి మెత్తగా ప్రజలపై భారం మోపడంలో సోమేష్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే టాక్ ఉంది. డిపార్ట్మెంట్ ని తన గుప్పిట్లో పెట్టుకోవడం, ఆఫీసర్స్ కి వారి పరిధి ఏంటో కూడా తెలియని విధంగా వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. తనకు అనుకూలమైన టీం ని రెడీ చేసుకుని వారికి అనుకూలమైన వారికే పనులు చక్కపెడతారనే ఆరోపణలూ ఉన్నాయి. అలా, కోర్టు ధిక్కరణ కేసులు వేలల్లో నమోదయ్యాయి. న్యాయవ్యవస్థ అంటే లెక్కలేదనట్టుగా వ్యవహరిస్తారని అంటుంటారు. అలాంటి సోమేష్ కుమార్ సీఎం కి మళ్లీ ప్రధాన సలహాదారుడుగా రావడంతో తమకు వర్క్ స్వేచ్ఛ ఉండదనే ఫీలింగ్ లోకి అధికారులు వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా సోమేష్ రాకను జీర్ణించుకోలేకపోతున్నారట. ఆచితూచి అడుగేయాల్సిన ఈ సమయంలో సోమేష్ పెత్తనం మంచి నిర్ణయమేనా? అనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
రిటైర్డ్ ఆఫీసర్స్ దే పైచేయి!
ఇరిగేషన్, ఇంటెలిజెన్స్, హెచ్ఎండీఏ లో రిటైర్డ్ ఆఫీసర్స్ హవా కొనసాగుతోంది. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ లోనే 28 మంది అధికారులు పదవీ కాలం ముగిసినా ఇంకా ఓఎస్డీల పేర్లతో కొనసాగుతున్నారు. వారిని కీలకమైన పోస్టింగ్స్ లో కూర్చోబెట్టింది ప్రభుత్వం. ఎస్ఐబీ పేరుతో అంతా వారే ఉన్నారు. చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ పేరుతో రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు కొనసాగుతున్నారు. ఇతనే ఆ పేరుతో ఇంటెలిజెన్స్ ని గుప్పిట్లో పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఇవ్వాల్సిన రివ్యూ మీటింగ్ లు ప్రభాకర్ రావే ఇస్తుంటారని సమాచారం. ఇక, ఇదే శాఖలో ఓఎస్డీగా, మరో ముగ్గురు నాన్ కేడర్ అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు.. ట్రాన్స్ కో లో ఒకరు, పోలీస్ అకాడమీలో ఒకరు, ఏసీబీలో ఒక రిటైర్డ్ ఎస్పీ, స్పెషల్ డ్యూటీ పేరుతో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఓఎస్డీ రాధాకిషన్ రావు కూడా రిటైర్డ్ అయ్యాక ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఎంతోమంది యంగ్ ఆఫీసర్స్ ని ఏండ్ల తరబడి అటాచ్ మెంట్ అంటూ అత్యంత విలువైన సమయాన్ని, సర్వీస్ ని ప్రభుత్వం కావాలని పాడు చేస్తోందని మండిపడుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల్లో వారి సొంత ఆస్తులను పెంచుకోవడానికే ఎస్టిమేషన్స్ ఇష్టానుసారంగా పెంచేసుకొని బడా కాంట్రాక్టర్స్ కి మేలు చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయని అంటున్నాయి. ఇక హెచ్ఎండీఏ లో కీలకమైన పదవుల్లో రిటైర్డ్ అధికారులే ఉన్నారు. అనుమతులు ఇవ్వడంలో.. భూములు వేలం వేయడంలో వీరిదే కీలక పాత్ర. వారంతా అక్రమ అనుమతులు ఇచ్చి భారీగా దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.