కక్షసాధింపు చర్యలకు పాల్పడిన అధికారులకు హైకోర్టులో చుక్కెదురు కావడం శుభపరిణామం అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒత్తిడితో.. కోర్టును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసి హైకోర్టులో అక్షితలు వేయించుకోవడం అధికారులకు అవసరమా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ బొమ్మి సుమంత్ కు ఆపిన బిల్లులను 12 శాతం వడ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కక్షసాధింపులకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.
అయితే.. నియోజకవర్గంలోని తోటపల్లి పంచాయతీ పరిధిలో 2018లో రూ.20 లక్షల ఎస్డీఎఫ్, ఎన్ఆర్జీఎస్ నిధులతో సుమంత్ సిమెంట్ రోడ్లు నిర్మించారు. దీనికి సంబంధించి ఎస్డీఎఫ్ నిధులు రూ.6 లక్షల చెక్కుకు 2019లోనే తీసుకున్నారు. కాంట్రాక్టర్ తండ్రి బొమ్మి సురేంద్ర టీడీపీలో సీనియర్ నాయకుడు కావడంతో.. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి బిల్లులకు అడ్డు పడ్డారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని.. సుమంత్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టుకు.. అసలు ఆ పనులు చేసింది సుమంత్ కాదని కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు అధికారులు. ఏఈ నుంచి ఈఈ వరకు నమోదు చేసిన అధికారిక రికార్డులు.. గతంలో జరిగిన చెల్లింపుల వివరాలను సుమంత్ కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ వేస్తామని… తప్పు జరిగినట్టు తేలితే బాధ్యులైన అధికారులను కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపుతామని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ కు నాలుగు వారాల్లో వడ్డీతో సహా బిల్లులు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సంబంధిత అఫిడవిట్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.