రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన పద్దతులు అవలంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి బీజేపీ నేతల రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పోలింగ్ బూత్, శక్తి కేంద్ర స్థాయిలో పార్టీ ఇన్ ఛార్జీల నియామకం దాదాపుగా పూర్తి అయిన తర్వాత విస్తరణ యోజనలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన బీజేపీ నేతల సమావేశంలో పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను ఆయన ప్రస్తావించారు.
రాష్ట్ర స్థాయిలో 5000 కు పైగా ప్రజాపోరు స్ట్రీట్ కార్నర్ మీటింగులు దిగ్విజయంగా పూర్తి కావడంతో నేతలతో ఇదే విషయంలో సమీక్ష నిర్వహించి ప్రజాభిప్రాయాలను గురించి తెలుసుకున్నారు.
ఉత్తరాంధ జలం కోసం జనపోరు యాత్ర, రాయలసీమ రణభేరి తరవాత ప్రజాపోరు సభలు నిర్వహించిన నేపథ్యంలో గ్రామస్ధాయిలో పార్టీ బలోపేతం కావడానికి ప్రజాపోరు సభలు ఉపకరించాయని బీజేపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ సహా ఇంఛార్జి సునీల్ దేవధర్ మాట్లాడుతూ విస్తారణ యోజన ద్వారా నియోజకవర్గ స్ధాయిలో పార్టీ బలపడడానికి ఒక రోడ్ మ్యాప్ లాగా నేతలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి పోలింగ్ భూత్ స్ధాయిలో సంఖ్యాబలం పెంచుకోవడానికి నేతలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విస్తారణ్ యోచన ఆధారంగా పార్టీ నిర్మాణం జరిగితే గ్రామస్ధాయిలో పోరాటాలు చేయడానికి వీలు కలుగుతుందని సునీల్ దేవధర్ అభిప్రాయపడ్డారు. నేతల పనివిధానం ఇతర విషయాలపై రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ పలు సూచనలు చేశారు.