ఏపీలో ఎదగడానికి బీజేపీకి ఎట్టకేలకు అస్త్రాన్ని బయటకు తీసింది. ప్రత్యేక హోదా, ప్యాకేజీ హామీలను జనం మరిచిపోవడం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా వాటి గురించి నోరు మెదపకపోవడంతో ఇక.. రాష్ట్రంలోని మరో ప్రధాన సమస్యపై దృష్టి పెట్టింది. అదే రాజధాని అమరావతి అంశం.
మొన్నటిదాకా రాజధాని ఎక్కడ పెట్టాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని, వైసీపీ ప్రభుత్వానికి వ్యూహాత్మకంగానే ఫ్రీడమ్ ఇచ్చింది. రాజధాని తరలింపుపై అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరిగి, పెద్దదయ్యేదాకా చూస్తూ కూర్చుంది. చివరికి అటు అమరావతి అభివృద్ధికి నోచుకోక, ఇటు మూడు రాజధానుల అంశమూ ముందుకు కదలలేక ఉన్న పరిస్థితిలో కమలం పార్టీ తమ గళాన్ని సవరించుకుంది.
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఇందులో మరో ఆలోచన లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా సెలవిచ్చారు. రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్ర సంస్థలు అమరావతిలోనే ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుందని ఒట్టేశారు. ప్రధాని మోదీ ప్రతినిధిగా తన హామీ అంటూ ప్రతిజ్ఞ చేసినంత పని చేశారు. టీడీపీ ఆల్ రెడీ దెబ్బతిని ఉంది.. సో వైసీపీని దెబ్బేసేందుకు తాపీగా రంగంలోకి దిగిందన్న మాట ఏపీ బీజేపీ.