సైనికుల ఎంపిక కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో విద్రోహ శక్తుల కుట్ర దాగివుందని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. ఒక పథకం ప్రకారమే విధ్వంసానికి ఒడిగట్టారని అన్నారు. విదేశీ శక్తులు కొన్ని వర్గాలు కలిసి విధ్వంస రచన చేశారని ఆయన ఆరోపించారు.
అగ్నిపథ్ పథకంపై కావాలనే కొందరు సంఘ విద్రోహ శక్తులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.
విధ్వంసకారుల కుట్రను అడ్డుకోవాలంటే విశాఖ, గుంటూరు, తిరుపతి, తదితర రైల్వేస్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేయాలని సోము వీర్రాజు సూచించారు. అదేవిధంగా ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అల్లర్లు, హింసాత్మక ఘటనలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు అల్లరిమూకలు ఎక్కడి నుంచి వచ్చారు? విధ్వంసకాండకు పాల్పడింది ఎవరనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఆందోళనల వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కుట్రకోణంపై ఆరా తీస్తున్నారు.