ఏపీలో ఆలయాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే తిరుమలలో పెంచిన రేట్లపై రాజకీయ దుమారం రేగగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కానీ, ఆలయాల్లో సామాన్యుడికి అధిక ధరల పోటు ఆగడం లేదు. తాజాగా కాణిపాకం వినాయకుడి అభిషేకం ధర పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెంచడం అంటే.. ఒకటి రెండు రెట్లు కాదు.. ఏకంగా ఏడు రెట్లు పెంచింది దేవాదాయశాఖ.
ఈ నిర్ణయంపై అనేక విమర్శలు వస్తున్నాయి. భక్తులను దేవుడికి దూరం చేసే కుట్ర సైలెంట్ గా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ నిర్ణయంపై స్పందించారు. కాణిపాకం వినాయకుడి అభిషేకం ధర ఏడు రెట్లు పెంచడాన్ని వ్యతిరేకించారు. రూ.750 నుండి ఒకేసారి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఇలాంటి నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం హిందూ ద్వేషాన్ని వెళ్ళగక్కుతోందని ధ్వజమెత్తారు. అభిషేకంపై పెంచిన ధరను వెంటనే వాపస్ తీసుకోకపోతే న్యాయం చేతిలో అన్యాయానికి పాతర వేస్తామని హెచ్చరించారు. ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులకు కేవలం పులిహోరతో సరిపెడుతున్నారని.. చక్రపొంగలి సహా ఇతర ప్రసాదాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
పర్వదినాల సమయంలో ప్రసాదాలు, ఇతర సౌకర్యాల విషయంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సోము వీర్రాజు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై హిందూ సంఘాలు కూడా ఫైరవుతున్నాయి. హిందూ ఆలయాల్లో విపరీతంగా రేట్లు పెంచేసి.. సామాన్య భక్తులకు దేవుడ్ని దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి. కొందరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. ‘‘ఇలా ధరలు పెంచితే లాభం లేదు గానీ.. గుడికి వెళ్లిన వాళ్లకు ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం చేయండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.