బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ నిన్న రాజీనామా చేశారు. అయితే ఆయన పోతూ పోతూ సోము వీర్రాజు కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అది ఇప్పుడు సోము వీర్రాజుకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం సోము బాపట్ల పర్యటనలో ఉన్నారు. ఈ విషయం గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా నా మీద అనేక ఆరోపణలు చేశారు.
అప్పుడే స్పందించలేదు.. ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవడానికి బీజేపీ, జనసేన కలిసిన ప్రభుత్వం స్థాపితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ లో వారాహి వాహన పూజ సమయంలో పవన్ అన్న మాటలను గుర్తు చేశారు. మోడీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముంఉదకు దూసుకుపోతుందన్నారు.
ఏపీకి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తున్నట్లు ఆయన మరోసారి పేర్కొన్నారు. అయితే.. కన్నా ఆరోపణలను పెద్దగా నమ్మట్లేదని ఎంపీ జీవీఎల్ అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారని.. దీని పై మా పార్టీ నాయకులతో నేను మాట్లాడానని.. కన్నా కు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చారని.. ఎంపీ జీవీఎల్ అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారని.. ఈ రెండు ఎంతో కీలకమైన పదవులని.. కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమేనని.. గతంలో సోమువీర్రాజు పై అనేక వ్యాఖ్యలు చేశారని.. పార్టీలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి చెప్పే చేశారని జీవీఎల్ అన్నారు. సోము ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. నా పై కూడా గతంలో, ఇప్పుడు కన్నా విమర్శలు చేశారని.. నా పరిధిలో నేను పని చేస్తున్నానని.. కన్నా విమర్శలు పై నేను మాట్లాడనని జీవీఎల్ అన్నారు.