ఆలయమంటే చాలు.. అది మాదే అన్నట్లు దూకుతారు. వాళ్లకు పేటెంట్ ఉన్నట్లే మాట్లాడతారు. అలాంటిది… ఇంత పెద్ద ఇష్యూ జరిగితే.. సైలెంటుగా ఊరుకున్నారు. స్వరూపానంద స్వామిలాంటివాడికి దేవాలయాల్లో .. ప్రత్యేక పూజ ఆయన జన్మదినం రోజు చేయించాలని ప్రభుత్వమే ఆదేశాలిస్తే.. అందరూ విరుచుకుపడుతున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాని మన సోము వీర్రాజుగారు మాత్రం చప్పుడు చేయకుండా ఉన్నారు. బిజెపి నుంచి అస్సలు రియాక్షనే లేదు. అదేంటంటే.. అసలు సోమువీర్రాజుకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య వెంకటస్వామి పాత్ర .. మన స్వామిదే కదా. అందుకే.
మామూలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహారం నడిపిస్తున్న ఏపీ బిజెపి.. దేవాలయాల విషయంలో మాత్రం రైజ్ అవుతుంది. అంతర్వేదిలో రథం తగలబడగానే రచ్చ రచ్చ చేసింది. అసలు రాష్ట్రమంతా ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసేంత ఉద్రిక్తత కల్పించింది. కాని జగన్ సీబీఐ విచారణ అనగానే సైలెంట్ అయిపోయింది. దుర్గగుడిలో వెండి విగ్రహాలు మాయం అయినప్పుడూ అదే తంతు. ఇక తిరుమలలోనూ ఏం జరిగినా.. స్పందించేంది ఆ భానుప్రకాష్ రెడ్డి మాత్రమే.
కాని ఈ మధ్య మాత్రం బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ సైతం దేవాలయాల ఆస్తులను పరిరక్షించడంలో వైసీపీ ఘోరంగా విఫలమవుతుందనే కామంట్ చేశారు. పైగా క్రిస్టియన్ రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ఇక సోము వీర్రాజు సైతం.. తిరుమల ఆస్తులను అమ్మటానికి చూస్తున్నారని.. అలా చేస్తే వైసీపీ ప్రభుత్వాన్ని సహించేది లేదని ప్రకటించారు. దేవాలయాల విషయంలో ఇంత ఘాటు విమర్శలు చేసిన బిజెప నాయకులు స్వరూపానందస్వామికి సేవలందించే విషయంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదు.
స్వామిజీలు, బాబాల విషయంలో మొదటి నుంచి బిజెపిది స్పెషల్ రూటు. వారికి అనుకూలంగా ఉంటే ఓకె.. లేదంటే ఏకిపారేస్తారు. స్వరూపానందస్వామి, అలాగే తెలంగాణలో చినజియర్ స్వామిలు ఇద్దరూ కేసీఆర్, జగన్ ఇద్దరికీ అనుకూలంగా వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు. జగన్ ఓకె గాని.. ప్రస్తుతం కేసీఆర్ కమలానికి ప్రత్యర్ధి. అవకాశం దొరికితే విరుచుకుపడటానికే చూస్తోంది. అలాంటిది.. స్వరూపానందస్వామి ఇష్యూలో.. మౌనంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది.
ఒకటి మాత్రం వాస్తవం. పార్టీ ఒకటే అయినా.. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం వారి వ్యూహం కావొచ్చు.. కాని నాయకుల పాత్ర కూడా చాలానే ఉంటుంది. ఇదే వ్యవహారం తెలంగాణలో జరిగుంటే.. ఈపాటికి బిజెపి నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఆగమాగం చేసేవాళ్లు. ఇక్కడ సోమువీర్రాజు కాబట్టి.. ఏ వీరంగం లేకుండా సైలెంటుగా ఉండిపోయారనే కామెంట్లు వినపడుతున్నాయి.