దేశ వ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పని చేస్తున్న ఏకైక పార్టీ అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ మాత్రమే సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్రంలో నిమ్న వర్గాల వర్గీకరణ చేయమన్న వైసీపీ పట్టించుకోవట్లేదని విమర్శించారు.
వైసీపీ, టీడీపీ పార్టీలు బీసీలకు తమలపాకులు ఇచ్చి, అగ్ర వర్ణాల వారికి తాంబూలాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రస్తుతం బీసీలకు, ఎస్సీలకు పదవులు ఇచ్చారు కానీ వారికి పవర్ ఇవ్వలేదు. రాష్ట్రంలో మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వివరించారు.
వైసీపీ క్యాపిటల్ కట్టకుండా నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వని కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము వైసీపీ వాళ్లకు లేదంటూ ఆయన విమర్శించారు. రైతులు రాజధాని కోసం నడుస్తుంటే రాజకీయం చేస్తున్నారు.
వైసీపీ నాయకులకు వ్యక్తిత్వం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.రాష్ట్రంలో సీఎం ఇచ్చిన స్క్రిప్ట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారంటూ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు కూడా కేవలం కుటుంబ రాజకీయాలు, దందాలు అవినీతి కోసమే పాకులాడుతున్నట్లు వివరించారు. ఏపీ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని ఆయన వివరించారు.